యాషెస్ సిరీస్: పట్టుబిగిస్తోన్న ఆస్ట్రేలియా

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా నెమ్మదిగా పట్టుబిగిస్తోంది. రికీపాంటింగ్ రాణింపుతో తొలి టెస్ట్ గురువారం రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 249 పరుగులు చేసింది. రికీపాంటింగ్ (155), సైమన్ కటిచ్ (104) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ నెమ్మదిగా ఒత్తిడిలోకి జారుకుంటోంది.

అంతకుముందు 336/7 వద్ద రెండు రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే బ్రాడ్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన గ్రేమ్ స్వాన్.. ఆండర్సన్‌తో కలిసి ఇంగ్లాండ్ స్కోరును ముందుకు కదిలించాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో 68 పరుగులు వచ్చాయి.

ఆండర్సన్ (26) సాయంతో రాణించిన గ్రేమ్ స్వాన్ (47) ఇంగ్లాండ్ స్కోరును 400 దాటించాడు. హస్సీ బౌలింగ్‌లో ఆండర్సన్ వెనుదిరగగా.. ఆ తర్వాతి చివరి వికెట్‌గా వచ్చిన పనేసర్ (4) కొంత సేపు కూడా నిలబడలేకపోయాడు. దీంతో 435 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

లంచ్‌కు కొద్ది సేపు ముందు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అసీస్ జట్టు శుభారంభమే చేసింది. హ్యూగ్స్ బౌండరీలతో కాసేపు మైదానంలోని ప్రేక్షకులను అలరించాడు. మరో ఓపెనర్ సైమన్ కటిచ్ నిలకడగా ఆడాడు. అయితే ఫ్లింటాఫ్ వేసిన బంతి హ్యూగ్స్ బ్యాట్ అంచును తాకి ప్రయర్ చేతిలోకి వెళ్లింది.

ఇంగ్లాండ్ శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కానీ, ఈ ఆనందం వారిలో ఎక్కువ సేపు నిలవలేదు. ఇటీవల వరుసగా విఫలమవుతూ వస్తున్న కెప్టెన్ పాంటింగ్ ఈ మ్యాచ్‌లో కదం తొక్కాడు. కటిచ్ అండతో అసీస్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.

కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ వరుసగా ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ మరికొద్ది సేపటిలో ముగుస్తుందనగా పాంటింగ్ 155 పరుగులు చేశాడు. నిజానికి కటిచ్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే వెనుదిరగాల్సి ఉంది. కటిచ్ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లాండ్ ఫీల్డర్లు జారవిడుచుకుని తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం క్రీజులో పాంటింగ్, కటిచ్‌లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి