ఆసియా కప్ టైటిల్ పాకిస్థాన్ - శ్రీలంకల్లో ఎవరికి దక్కేను?

శుక్రవారం, 7 మార్చి 2014 (15:18 IST)
File
FILE
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో శనివారం టైటిల్ పోరు జరుగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

లంకేయులు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకున్నారు. ఇక డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో లంక చేతిలో ఓడినా, ఆ తర్వాత భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లపై నెగ్గి టైటిల్ సమరానికి సిద్ధమైంది.

శ్రీలంక జట్టులో కుమార సంగ్కకర టాప్ ఫామ్‌లో ఉండగా, మలింగ, అజంత మెండిస్ బౌలింగ్‌లో రాణిస్తూ జట్టును ముందుండి గెలిపిస్తున్నారు. అలాగే, పాక్ జట్టులో ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది, ఉమర్ అక్మల్, ఓపెనర్ షెహజాద్, కెప్టెన్ మిస్బాలపైనే ఆశలు పెట్టుకుంది.

బౌలింగ్ విభాగంలో ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ రాణిస్తే అజేయ లంకకు ముకుతాడు వేయడం కష్టమేమీకాబోదని పాక్ శిబిరం భావిస్తోంది. అయితే, ఈ టోర్నీలో లంకేయులు నిలకడగా ఆడుతుండగా, పాక్ ఆటగాళ్లు ఎపుడు ఎలా ఆడతారో ఎవరికీ అంతు చిక్కని పరిస్థితి నెలకొనివుంది.

వెబ్దునియా పై చదవండి