ఆస్ట్రేలియా భారీ స్కోరు : ఏడు వికెట్లకు 527 స్కోరు.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్

FILE
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లకు 527 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్ చేసింది. గురువారం, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసిన ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించి, మరో 40 పరుగులు జత చేసిన తర్వాత స్టీవెన్ స్మిత్ (89) వికెట్‌ను కోల్పోయింది.

డేవిడ్ వార్నర్ కేవలం ఐదు పరుగులు చేసి వెనుదిరగ్గా, కెప్టెన్ క్లార్క్ 314 బంతుల్లో 187 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పీటర్ సిడిల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. చివరిలో బ్రాడ్ హాడిన్, మిచెల్ స్టార్క్ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించడం విశేషం.

క్లార్క్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి హాడిన్ 65, స్టార్క్ 66 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గ్రేమ్ స్వాన్‌కు ఐదు వికెట్లు లభించాయి.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండోరోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 52 పరుగులు చేసింది. జొనథాన్ ట్రాట్ 2, అలిస్టర్ కుక్ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి