ఇంగ్లండ్‌కే బూడిద: ఫ్రెడ్డీకి ఘనమైన వీడ్కోలు

File
FILE
ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్ నాలుగేళ్ల తరువాత తిరిగి బూడిదను సొంతం చేసుకుంది. యాషెస్ సిరీస్ నిర్ణయాత్మక ఐదో టెస్ట్‌లో ఆస్ట్రేలియాను ఆతిథ్య జట్టు 197 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ చివరిసారి ఈ సిరీస్‌ను 2005లో దక్కించుకుంది.

తాజా టెస్ట్‌లో మరో రోజు మిగిలివుండగానే విజయం సాధించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌‍కు టెస్ట్ క్రికెట్ నుంచి ఘనమైన వీడ్కోలు పలికారు. ప్రస్తుత యాషెస్ సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఫ్లింటాఫ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రెడ్డీకి యాషెస్ విజయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతమైన బహుమతి అందించారు.

ఒవల్‌లో జరిగిన ఐదో టెస్ట్‌లో పరాజయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌తోపాటు, నెంబర్‌వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఎన్నో ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ నెంబర్‌వన్ హోదాలో ఉన్న ఆస్ట్రేలియన్లు ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. ఐదో టెస్ట్‌లో 546 పరుగుల రికార్డు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 197 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.

మైక్ హసీ (121) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశాడు. 80/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కటిచ్ (43) స్వాన్‌ను వికెట్ల ముందు దొరికిపోగా, అనంతరం కాసేపటికే మరో ఓపెనర్ వాట్సన్ (40)ను బ్రాడ్ పెవీలియన్ దారిపట్టించాడు.

ఆ తరువాత కెప్టెన్ రికీ పాంటింగ్, హసీలు జాగ్రత్తగా ఆడుతూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. లంచ్ విరామం తరువాత అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న పాంటింగ్, హసీలు క్రీజ్‌లో పాతుకుపోయినట్లు కనిపించారు. అయితే లాస్ట్ టెస్ట్ బాయ్ ఫ్లింటాఫ్ వేసిన ఓ అద్భుతమైన త్రోకి పాంటింగ్, హసీ భాగస్వామ్యానికి తెరపడింది. ఫ్లింటాఫ్ త్రోకి పాంటింగ్ (66) నిష్క్రమించాడు.

ఆ తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్ చేతిలో క్లార్క్ కూడా రనౌటయ్యాడు. ఆసీస్ కష్టాలు ఇక్కడే మొదలయ్యాయి. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ ఆటగాళ్లు మళ్లీ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు హసీ ఒంటరిపోరాటం చేస్తున్నా, మిగిలిన వారెవరూ అతనికి అండగా నిలవలేదు.

ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న హసీ పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు శుభం కార్డు పడింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్మిసన్ మూడు, బ్రాడ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాను 348 పరుగులకు ఆలౌట్ చేసి తమ స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 160 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), ఏజే స్ట్రాస్ (ఇంగ్లండ్)లు సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు.

వెబ్దునియా పై చదవండి