ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఆనియన్స్

ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో గ్రాహం ఆనియన్స్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవడంతో, ఆ అవకాశం ఆనియన్స్ తలుపుతట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయిన ఫ్లింటాఫ్ స్థానాన్ని ఆనియన్స్‌తో భర్తీ చేస్తూ ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా ఆనియన్స్‌ను ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ జట్టులోనూ చేర్చినట్లు ఈసీబీ వెల్లడించింది. ఫ్లింటాఫ్ స్థానంలో్ ఆనియన్స్‌కు చోటు కల్పించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ సాంకేతిక కమిటీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 5 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో ఎనిమిది దేశాలు పాల్గొంటాయి.

ఆనియన్స్ ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో వన్డే క్రికెట్ ఆడలేదు. ఈ ఏడాదే వెస్టిండీస్‌పై టెస్ట్ ఆరేంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆనియన్స్ ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. సౌతాంప్టన్‌‍లో బుధవారం జరిగే మూడో వన్డే జట్టుకు ఆనియన్స్ అందుబాటులో ఉండాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి జోరు మీదుంది.

వెబ్దునియా పై చదవండి