ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరయు అమీన్ ఎంపికయ్యారు. భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై వేటు వేసిన బీసీసీఐ, పనిలో పనిగా ఐపీఎల్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరయు అమీన్‌ను నియమించింది. దీంతో లలిత్ మోడీ ఐపీఎల్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతారా? లేదా? అనే అంశంపై వారం రోజుల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
కాగా లలిత్ మోడీ వ్యవహారంపై ఐపీఎల్ పాలకమండలి సమావేశం సోమవారం ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో లలిత్ మోడీ అవకతవకలకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇంకా ఐపీఎల్ వ్యవహారాలపై స్వేచ్ఛగా విచారణ జరిపేందుకే మోడీని ఛైర్మన్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. దీంతో పాటు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరయు అమిన్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇకపోతే ఐపీఎల్ నాలుగో సీజన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరుగు సభ్యులతో కూడిన మధ్యంతర కమిటీని ఐపీఎల్ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రవిశాస్త్రి, గవాస్కర్, పటౌడీలతో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. అలాగే లలిత్ మోడీకి ఇచ్చిన ఛార్జ్ షీట్లో బీసీసీఐ 22 అభియోగాలను చేర్చింది.