ఐపీఎల్ ప్రారంభ సీజన్‌నే బాగుంది: సచిన్

దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ కంటే గత ఏడాది భారత్‌లో జరిగిన ప్రారంభ సీజనే ప్రభావవంతంగా ఉందని టీం ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు సచిన్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

రెండు సీజన్లలోనూ ఆడిన సచిన్ మంగళవారం మాట్లాడుతూ.. రెండో సీజన్‌తో పోలిస్తే ప్రారంభ సీజన్ బాగుందని చెప్పాడు. భారత్‌లో ఆడటం పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపాడు. అయితే దక్షిణాఫ్రికాలో తమను స్వాగతించిన తీరు కూడా అద్భుతంగా ఉందని సచిన్ పేర్కొన్నాడు. అతి తక్కువ సమయంలో ఐపీఎల్ రెండో సీజన్‌కు ఆతిథ్య ఏర్పాట్లు చేసిన దక్షిణాఫ్రికాను సచిన్ ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఏర్పాట్లు చేసేందుకు వారికి చాలా తక్కువ సమయం మాత్రమే దొరికింది. ఇటువంటి పెద్ద టోర్నీకి మూడున్నర వారాల్లోనే అంతా పూర్తి చేయడం సులభసాధ్యం కాదు. అయినా వారు దానిని చేసి చూపించారని, టోర్నీ నిర్వహణకు సకల ఏర్పాట్లు చేయగలిగారని సచిన్ ప్రశంసించాడు. అయితే ఐపీఎల్ రెండో సీజన్ కూడా భారత్‌లోనే జరిగి ఉంటే తొలి సీజన్‌కన్నా భారీ స్పందన వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డాడు.

వెబ్దునియా పై చదవండి