ఐపీఎల్ బాగా ఉపయోగపడింది: ఓజా

దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో ఆడటం తనకు ఎంతో మేలు చేసిందని టీం ఇండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడటం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన ప్రజ్ఞాన్ ఓజా ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్ జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.

ప్రజ్ఞాన్ ఓజా బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ- మ్యాచ్ ద్వారా ఐసీసీ ప్రపంచకప్‌లో ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్న ఓజా మాట్లాడుతూ.. ఆడిన తొలి అంతర్జాతీయ ట్వంటీ- 20 మ్యాచ్‌లోనే ఈ అవార్డు దక్కడంపట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చినందుకు ఆనందంగా ఉందన్నాడు.

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభం కాదు. ఒకసారి జట్టులోకి వచ్చిన తరువాత నీ మీద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. తనకు లోపల కొంత భయం ఉన్నప్పటికీ, ఐపీఎల్ తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడంతో వలన నాలో ఆత్మవిశ్వాసం మెరుగుపడింది. ఇటీవల కాలంలో తాను పేస్‌‍లో వైవిధ్యం కనబరచగలుగుతున్నానని, ఇదే తన విజయ రహస్యమని ఓజా తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి