ఐపీఎల్-4లో సౌరవ్ గంగూలీ, ద్రావిడ్‌లకు గడ్డుకాలమే..!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లకు గడ్డుకాలం తప్పదట. అదే వాస్తవమైతే మాత్రం వీరిద్దరూ ఇక ఆటగాళ్ల వేలంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ తొలి మూడు సీజన్లలో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలు విఫలమవడంతో జట్టును ప్రక్షాళన చేయడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం నడుంబిగించింది. క్రిస్ గేల్ (అందుబాటులో ఉంటే) మినహా మరెవ్వరినీ కొనసాగించరాదని నిర్ణయించింది. దీంతో ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కారణంగా సహజంగానే గంగూలీని పక్కనబెట్టనున్నట్టు సమాచారం.

మరోవైపు దిగ్గజ హోదాలో గంగూలీకి రూ. 4.13 కోట్లు చెల్లించడం కంటే ఆటగాళ్ల వేలం ద్వారా ఈ మాజీ సారథిని కనీస ధర (రూ.92 లక్షలు)కు కొనుగోలు చేయాలని నైట్‌రైడర్స్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి రాహుల్ ద్రావిడ్‌కూ స్థానచలనం తప్పేట్టులేదు. ఐపీఎల్ కొత్త నియమావళిని అనుసరించి ఎంతమంది ఆటగాళ్లను అంటిపెట్టుకునే అవకాశముందో అంతమందికే కాంట్రాక్టును పొడిగించాలని బెంగళూరు నిర్ణయిస్తే రాహుల్ ద్రావిడ్ స్థానం ప్రశ్నార్థకమేనని వార్తలొస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి