ఐపీఎల్-4: సొంతగడ్డపై డెక్కన్ చార్జర్స్‌కు చుక్కెదురు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా సొంతగడ్డపైనే డెక్కన్ ఛార్జర్స్‌కు చుక్కెదురైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో స్థానిక డెక్కన్ ఛార్జర్స్‌కు తొలి దెబ్బ తగిలింది. ఐపీఎల్-4 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

జొహాన్ బోథా విశ్వరూపాన్ని ప్రదర్శించి, 47 బంతుల్లోనే 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ప్రతిభ కారణంగా 138 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేరుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, డక్కన్ చార్జర్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు శిఖర్ ధావన్, ఇశాంక్ జగ్గీ ధాటీగా ప్రారంభించారు.

అయితే, జట్టు స్కోరు 40 పరుగుల వద్ద అమిత్ సింగ్ బౌలింగ్‌లో అభిషేక్ రావత్ క్యాచ్ అందుకోగా ధావన్ అవుటయ్యాడు. ఒక దశలో ఛార్జర్స్ 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఛార్జర్స్ తరపున రవితేజ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా డక్కన్ చార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 137 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో అమిత్ సింగ్, త్రివేదిలకు చెరి మూడు వికెట్లు లభించాయి.

కెప్టెన్ వార్న్ రెండు వికెట్లు పడగొట్టాడు. డక్కన్ చార్జర్స్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో, అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని అందుకోవడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ 18.5 ఓవర్లలో, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు సాధించి, ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

వెబ్దునియా పై చదవండి