ఐపీఎల్4: కోల్‌కతాపై కోచి టస్కర్స్ గెలుపు

గురువారం, 5 మే 2011 (20:13 IST)
ఐపీఎల్4 పోటీల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, కోచి టస్కర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోచి కోల్‌కతాపై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. కోచి ఉంచిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైన కోల్‌కతా ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కోల్‌కతా కెప్టెన్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోచి టస్కర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. డాషింగ్ ఓపెనర్ మెక్‌కలం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ క్లింగర్, పార్ధీవ్ పటేల్‌లు కాస్త నిలకడగా ఆడారు.

క్లింగర్ 29 పరుగులు చేయగా, పార్ధీవ్ పటేల్ 21 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన కోచి కెప్టెన్ మహేల జయవర్ధనే అద్భుతంగా బ్యాటింగ్ చేసి 41 బంతుల్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. చివర్లో బ్రాడ్ హడ్జ్ తన మెరుపు బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే 35 పరుగులు చేయటంతో కోచి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో157 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు ఉంచింది.

కోల్‌కతా జట్టు ఓపెనర్లు కలిస్, మోర్గాన్‌లు శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలమవ్వటంతో లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. కలిస్ 45 పరుగులు చేయగా మోర్గాన్ 66 పరుగులు చేశాడు. కెప్టెన్ గంభీర్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. కోచి జట్టులో వినయ్ కుమార్, గోమెజ్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి