ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌: ధోనీసేన నిష్క్రమణ!

FILE
వెస్టిండీస్‌ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ నుంచి భారత్ దాదాపుగా నిష్క్రమించింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 14 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా 2010 ఐసీసీ ప్రపంచకప్‌ను ధోనీసేన గెల్చుకుంటుందని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశనే మిగిలింది.

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత 170 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.

టీం ఇండియా జట్టులో సురేష్ రైనా (32) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ధోనీ (29) ఓ మోస్తారుగా రాణించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన విండీస్‌ కెప్టెన్‌ క్రిస్‌గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

భారత బ్యాట్స్‌మెన్లు పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంతోనే వెస్టిండీస్ చేతిలో భారత్ కంగుతింది. విండీస్ షార్ట్ పిచ్ బంతుల పరీక్షలకు నిలవలేక భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో, ధోనీసేనకు ఓటమి తప్పలేదు.

వెబ్దునియా పై చదవండి