కివీస్‌పై భారత్ హ్యాట్రిక్ విజయం: వన్డే సిరీస్ కైవసం..!

FILE
న్యూజిలాండ్‌తో వడోదరాలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సృష్టించిన గౌతం గంభీర్ సేన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ మరియు కెప్టెన్ గౌతం గంభీర్ కివీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో వరుసగా రెండో సెంచరీని సాధించడం ద్వారా 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్ధేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని 63 బంతులు మిగిలివుండగానే భారత్ సునాయాసంగా చేధించింది. గౌతం గంభీర్ సూపర్ సెంచరీ సాధించి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 117 బంతుల్లో 16 ఫోర్లతో 126 పరుగులు సాధించి చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన గంభీర్ జట్టును ఒంటి చేత్తో నడిపించి గెలిపించాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన మురళీ విజయ్ 50 బంతులాడి 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో, విరాట్ కోహ్లీ (63) ఆతని స్థానంలో గంభీర్‌కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు.

70 బంతులాడిన కోహ్లీ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో సూపర్ హాఫ్ సెంచరీని సాధించాడు. దీంతో కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 10వ అర్థసెంచరీ నమోదు చేసుకున్నాడు. ఫలితంగా 39.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన భారత్ 229 పరుగులతో విజయం సాధించింది. మూడో వన్డే గెలుపు ద్వారా గంభీర్ సేన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. టీమ్ ఇండియాను ఒంటి చేత్తో గెలిపించిన కెప్టెన్ గౌతం గంభీర్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో మెక్ కల్లమ్ 43 పరుగులు, ఫ్రాంక్లిన్ (72; నాటౌట్)లు మాత్రమే అధిక స్కోరు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశ్విన్, యూసుఫ్ పఠాన్‌లు రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టారు. పటేల్ మాత్రం ఏకైక వికెట్ సాధించాడు.

వెబ్దునియా పై చదవండి