కేప్‌టౌన్ టెస్టు: 51వ సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్!

మంగళవారం, 4 జనవరి 2011 (17:20 IST)
FILE
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ సాధించాడు. కేప్‌టౌన్ మూడో టెస్టు మూడో రోజైన మంగళవారం లంచ్ విరామానికి తర్వాత సచిన్ ఆడిన తొలి బంతి సిక్సర్‌గా మారింది. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ దక్షిణాఫ్రికాపై ఏడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్, 2011లో తొలి సెంచరీని సాధించాడు.

142/2 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్, ఆరంభంలోనే గౌతం గంభీర్ (93), వీవీఎస్ లక్ష్మణ్ (15)ల కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో బ్యాటింగ్ భారమంతా సచిన్ టెండూల్కర్ భుజస్కంధాలపై పడింది. ఈ క్రమంలో 213 బంతులాడిన సచిన్ టెండూల్కర్ 12 ఫోర్లు, ఏకైక సిక్సర్‌తో తన టెస్టు కెరీర్‌లో 51వ సెంచరీ సాధించాడు.

అయితే వీవీఎల్ అవుట్ కావడంతో క్రీజులోకి దిగిన పూజారా కేవలం రెండు పరుగులకే స్టెయిన్ బంతికి ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ దారి పట్టాడు. అలాగే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా పరుగులేమీ చేయకుండానే స్టెయిన్ బంతికి తలొగ్గాడు.

ప్రస్తుతం సచిన్ (109), భజ్జీ (6)లు క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ మూడు వికెట్లు పడగొట్టగా, హారిజ్ ఏకైక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి