క్రికెటర్లపై నిప్పులు చెరిగిన ఇంగ్లాండ్ మీడియా

క్రికెట్‌లో పసికూన జట్టు అయిన నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలవడంతో ఇంగ్లాండ్‌ క్రికెటర్లను ఆ దేశ మీడియా ఎండగట్టింది. ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్‌పై నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం ఈ పరాజయంపై బ్రిటన్ వార్తాపత్రికలు నిప్పులు చెరిగాయి.

పాల్ కాలింగ్‌వుడ్ బృందాన్ని ఏకిపారేసిన బ్రిటన్ పత్రికలు చివరి బంతికి రనౌట్ అవకాశాన్ని సద్వినియోగపరచలేకపోయిన ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ప్రత్యేకంగా పండగ చేశాయి. ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌కు చెత్త పరాజయాలు గతంలోనూ ఉన్నప్పటికీ, లార్డ్స్ వంటి చారిత్రాత్మక మైదానాల్లో ఇటువంటి ఫలితం అభిమానులను మరింత చికాకు పెడుతుందని ఓ పత్రిక పేర్కొంది.

ఇదిలా ఉంటే ప్రారంభ మ్యాచ్‌లో పరాజయంతో ఇంగ్లాండ్ స్వదేశంలో జరుగుతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్‌ తొలి రౌండు నుంచే ఇంటిముఖం పట్టే ప్రమాదాన్ని ఎదురుగా ఉంచుకుంది. ఈ పరాభవాన్ని తప్పించుకోవాలంటే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తప్పనిసరిగా విజయం సాధించాలి. నెదర్లాండ్ తరువాతి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని రాబట్టుకుంటే తరువాతి రౌండులో చోటు ఖరారు చేసుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి