చరిత్ర పునరావృతం చేసేందుకు భారత్ తహతహ

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శనివారం తన ఖాతా తెరవబోతుంది. తొలి మ్యాచ్‌లో టీం ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుండటంపై అందరి దృష్టి నెలకొంది. ఈ హైఓల్టేజ్ సమరం ప్రారంభమవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.

గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల తరువాత ఇరుదేశాల మధ్య ఇతర సంబంధాలతో క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల ప్రజలు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఐసీసీ ప్రధాన టోర్నీల్లో తమపై ఒక్కసారి కూడా నెగ్గని పాకిస్థాన్‌ను ఈసారి కూడా మట్టికరిపించి చరిత్రను పునరావృతం చేయాలని ధోనీ సేన తహతహలాడుతోంది. ప్రస్తుతం నెంబర్‌వన్ స్థానంలో ఉన్న టీం ఇండియాపై గతంతో సంబంధం లేకుండా కొత్త చరిత్ర సృష్టించేందుకు యూనిస్ ఖాన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఎదురుచూస్తోంది.

ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీకే హైలెట్‌గా నిలవబోయే మ్యాచ్ ఇదేనని క్రీడా వర్గాలు వక్కాణిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కీలకమైన సీనియర్ ఆటగాళ్లు లేకుండా టీం ఇండియా బరిలో దిగుతుంది. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ రూపంలో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు.

ఇప్పటికే టీం ఇండియాను బౌలింగ్, ఫీల్డింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. తాజాగా బ్యాటింగ్‌లోనూ ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లతోపాటు, ధోనీ కూడా రాణిస్తేనే జట్టు బ్యాటింగ్ విభాగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలదు.

వెబ్దునియా పై చదవండి