చరిత్ర సృష్టించిన భారత్: వన్డేల్లో నెం.1 స్థానం

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ అంతర్జాతీయ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రంగ ప్రవేశం చేశాక వన్డేల్లో భారత్‌కు అగ్రస్థానం దక్కడం సుదీర్ఘ విరామం తర్వాత దక్కిన ఫలితం ఇది.

అంతకుముందు, ఆరు వారాల విరామం తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్.. శ్రీలంక వెళ్లింది. అక్కడ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఆరంభం నుంచే తడబడింది. దీనికి తోడు భారత బౌలర్ల సమిష్టి కృషితో న్యూజిలాండ్‌ 155 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఏడు పరుగుల వద్దే తొలి వికెట్ దినేష్ కార్తీక్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఆచి తూచి ఆడుతున్న సచిన్ టెండూల్కర్‌కు గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ తోడయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ద్రవిడ్ ఎక్కువ సేపు క్రీజులు నిలవలేకపోయాడు.

దీంతో భారత్ అతి తక్కువ స్కోరుకే రెండు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. కానీ, సచిన్ మాత్రం సంయమనం కోల్పోలేదు. నిదానంగా ఆడుతూ.. న్యూజిలాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. నింపాదిగా ఆడుతూ.. మధ్యలో ఫోర్లతో అలరించాడు. తక్కిన బ్యాట్స్‌మన్‌ల సాయంతో సచిన్ భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

అద్భుత బౌలింగ్‌ చేసిన ఆశిష్ నెహ్రా.. 24 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. .యువరాజ్ సింగ్ 31 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అలాగే ఇషాంత్ శర్మ 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకర బ్యాట్స్‌మన్ కైల్ మిల్స్‌ను ఆర్‌పీ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆశిష్ నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి