ఛాంపియన్స్ ట్రోఫీ: ఆతిథ్య జట్టుకు అగ్నిపరీక్ష

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైన ఆతిథ్య జట్టు గురువారం అగ్నిపరీక్షను ఎదుర్కోబోతుంది. దక్షిణాఫ్రికా ఈ రోజు జరిగే గ్రూపు బి కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనా సెమీస్‌కు వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.

అయితే దక్షిణాఫ్రికాకు ఆ అవకాశం లేకుండా పోతుంది. భారత్‌తో సన్నాహాక మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్‌ను నిలువరించడం దక్షిణాఫ్రికాకు ఇప్పుడు కత్తిమీదసాముగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చే ఆల్‌రౌండర్లు న్యూజిలాండ్‌కు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు ఈ బలం ఉన్నప్పటికీ, ఒత్తిడిని అధిమించడం వారి ముందున్న అతిపెద్ద సవాలు.

ఎందుకంటే కివీస్ కంటే ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకే కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే దక్షిణాఫ్రికా జట్టు సభ్యులు స్వదేశంలో జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రేక్షకులు కావాల్సి ఉంటుంది. ఎనిమిది దేశాలు ఆడుతున్న ఈ టోర్నీలో రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ దశకు వెళతాయి. దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌తోపాటు, ఇంగ్లండ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి