ఛాంపియన్స్ లీగ్‌కు నేను రావడం లేదు: క్లార్క్

ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరిగే ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20 టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఎక్కువ క్రికెట్ ఆడానని, ఈ టోర్నీకి తాను రావడం లేదని క్లార్క్ ప్రకటించాడు. పాంటింగ్ రిటైర్మెంట్‌తో ఆస్ట్రేలియా ట్వంటీ- 20 కెప్టెన్ రేసులో ముందున్న క్లార్క్ ఆస్ట్రేలియా దేశవాళీ ట్వంటీ- 20 టోర్నమెంట్ ఛాంపియన్ న్యూసౌత్‌వేల్స్ జట్టు సభ్యుడు కూడా.

ఈ జట్టు ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20 టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. అయితే దీనికి తాను అందుబాటులో ఉండటం లేదని క్లార్క్ తెలిపాడు. క్లార్క్ లేనప్పటికీ, న్యూసౌత్‌వేల్స్ జట్టు ఛాంపియన్స్ లీగ్‌కు జట్టును ప్రకటించింది. సైమన్ కటిచ్ (కెప్టెన్), స్టువర్ట్ క్లార్క్, డౌగ్ బొల్లింగెర్, బ్రెట్‌లీ, నాథన్ హౌరిట్జ్, నాథన్ బ్రాకెన్‌లతో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది.

ఫిలిప్ హిగెస్, డేవిడ్ వార్నర్, హెన్రికెస్‌లు ఇతర సభ్యులు. బ్రాడ్ హాడిన్ గాయం నుంచి కోలుకొని కారణంగా ఛాంపియన్స్ లీగ్‌లో పాల్గొనే న్యూసౌత్‌వేల్స్ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అంతర్జాతీయ ఆటగాళ్లతోపాటు, ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లతో తమ జట్టు బలంగా ఉందని న్యూసౌత్‌వేల్స్ యాజమాన్యం పేర్కొంది. ఛాంపియన్స్ లీగ్ భారత్‌లో అక్టోబరు 10న ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి