టైటిల్ నిలబెట్టుకుంటే అద్భుతమే: రవిశాస్త్రి

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకుంటే అద్భుతమే అవుతుందని మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. రెండో ట్వంటీ- 20 ప్రపంచకప్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరుగుతుంది.

ఈ టైటిల్‌ను టీం ఇండియా తిరిగి కైవసం చేసుకోవడం అద్భుతమే అవుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రత్యర్థి జట్లు సూపర్ 8 దశలో టీం ఇండియాను నిలువరించేందుకు వ్యూహరచన చేసుకుంటున్నాయి. భారత్ రెండో రౌండులోకి అడుగుపెడితే.. ఆడాల్సిన మూడు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా లేదా వెస్టిండీస్ (జూన్- 12), ఇంగ్లాండ్ (జూన్- 14), దక్షిణాఫ్రికా (జూన్ 16)లతో తలపడుతుంది.

సెమీస్‌లోకి వెళ్లేందుకు ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ రెండింటిలో విజయం సాధిస్తే సరిపోతుంది. ఇప్పటికే ప్రత్యర్థులు టీం ఇండియా బలహీనతలను వెతికే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే మాజీ టీం ఇండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా టీం ఇండియా తిరిగి టైటిల్ చేజిక్కించుకోవడం అంత సులభం కాదన్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలర్ల ప్రదర్శనపై కొంచం ఆందోళన చెందుతున్నాడు. బౌలర్లు తొలి ఆరు ఓవర్లు, చివరి రెండు, మూడు ఓవర్లలో బంతులు విసురుతున్న తీరుపై ధోనీ ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి