ట్వంటీ-20 : హమ్మయ్యా.. ఎట్టకేలకు భారత్‌కు తొలి విజయం!!

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2012 (18:02 IST)
IFM
FILE
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో ధోనీ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల పటిష్టమైన బౌలింగ్ ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్లు పరుగు తీసేందుకు కంగారు పడ్డారు. ఫలితంగా 131 పరుగులు మాత్రమే చేశారు.

అనంతరం 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన... మరో రెండు బంతులు మిగిలివుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ సెహ్వాగ్ 16 బంతులను ఎదుర్కొని 23 పరుగులు చేసి హాగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు.

మరో గౌతం గంభీర్ 60 బంతుల్లో 52 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 31 పరుగులు చేయగా, కెప్టెన్ ధోనీ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హాగ్, మార్ష్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

వెబ్దునియా పై చదవండి