త్వరలోనే ఇండో-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్: భట్

గురువారం, 5 నవంబరు 2009 (11:49 IST)
త్వరలోనే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరుగవచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లు అనేకంగా వచ్చే యేడాది తటస్థ వేదికలపై జరుగవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత్‌ పర్యటనను ముగించుకున్న భట్ గురువారం స్వదేశానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన లాహోర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ వచ్చే ఏడాది జరుగవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించాలంటే తటస్థ వేదికలపై ఇరు జట్లు మ్యాచ్‌లు ఆడాలన్నదే తన అభిప్రాయమన్నారు.

ప్రధానంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేంత వరకు క్రికెట్ సిరీస్‌లు సాధ్యపడవని బీసీసీఐ ప్రతినిధులు కూడా అభిప్రాయపడినట్టు చెప్పారు. అంతేకాకుండా, మరో ఏడెనిమిది నెలలో పాటు భారత జట్టు తీరికలేని క్రికెట్ ఆడనున్న విషయం తెల్సిందే. అప్పటి వరకు ఇండో-పాక్ సిరీస్‌ల గురించి ఆలోచన చేయబోమని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తేల్చి చెప్పారన్నారు.

వెబ్దునియా పై చదవండి