త్వరలోనే ఓ ఇంటివాడినవుతా : భజ్జీ

"పద్మశ్రీ అయ్యారు.. శ్రీమతి ఎప్పుడు తెచ్చుకుంటారు" అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భారత బౌలర్ హర్భజన్ సింగ్.. త్వరలోనే ఓ ఇంటివాడినవుతానని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

పద్మశ్రీ వరించడం ఓ గొప్ప విషయమని, త్వరలోనే జీవితంలోనూ స్థిరపడాలి. ఆ బాధ్యతల్ని కూడా చేపడతానని హర్భజన్ అన్నాడు. పద్మశ్రీ అవార్డుతో చాలా థ్రిల్ ఫీలయ్యాననీ, ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తనను ఎంపిక చేయడం, తన కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవమని సంతోషం వ్యక్తం చేశాడు.

దేశంలో లభించిన అత్యున్నత అవార్డుల్లో ఇదీ ఒకటని, సరైన సమయంలోనే తననీ అవార్డు వరించిందనీ, ఇన్నాళ్లుగా క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా తనకీ అవార్డు వచ్చిందని భజ్జీ ప్రకటించాడు. తనకంటే ముందుగా ఈ గౌరవం దక్కించుకున్న సీనియర్లు ద్రవిడ్, సచిన్, అనిల్ కుంబ్లేల సరసన తాను కూడా చేరడం చాలా ఆనందకరమైన విషయమని అన్నాడు.

ఇదిలా ఉంటే... పద్మశ్రీ అవార్డును దివంగతుడైన తన తండ్రి సర్దేవ్ సింగ్‌కు అంకితమనిస్తున్నట్లు చెప్పిన భజ్జీ, తన ఎదుగుదల వెనుక ఆయన కృషి ఎంతగానో ఉందన్నాడు. అవార్డు ఆలస్యంగా వచ్చిందని తాను భావించటం లేదని, తనకు ఈ గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని హర్భజన్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి