ధోనీసేన పేలవమైన ఆటతీరు: డ్రాగా ముగిసిన చివరి టెస్టు!

కేప్‌టౌన్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్‌ అభిమానులను నిరాశపరిచింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆడిన తీరును చూసి ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. భారత బ్యాట్స్‌మెన్ల పేలవమైన ప్రదర్శనను చూసి బోర్ కొట్టడంతో చాలామంది స్టేడియం నుంచి మ్యాచ్ పూర్తికాక ముందే వెళ్లిపోయారు.

ముఖ్యంగా పేసర్ల పేలవమైన ప్రదర్శన కారణంగా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత్ ఆకాంక్ష నెరవేరకుండా పోయింది. కానీ ఐదో రోజు సఫారీల బౌలింగ్ ధాటికి ఓపెనర్ గౌతం గంభీర్ (64) సచిన్ టెండూల్కర్ (14), లక్ష్మణ్ (32), రాహుల్ ద్రావిడ్ (31)లు ప్రతిఘటించడంతో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలిగింది. అలాగే కీలక టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న దక్షిణాఫ్రికా ఆకాంక్ష కూడా నెరవేరలేదు.

2008 నవంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించి వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా సొంత గడ్డపై సిరీస్‌ను నెగ్గలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ తరువాత దక్షిణాఫ్రికా నిర్దేశించిన 340 పరుగులను చివరి రోజైన గురువారం సాధిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచి ఉండేది. ఈ లోపు టీమిండియా పది వికెట్లను తీస్తే దక్షిణాఫ్రికా గెలిచి ఉండేది.

కానీ కేప్‌టౌన్ పిచ్‌పై ఒక్కరోజులో 340 పరుగుల స్కోరు చేయడం అంత సులభమైన పని కాదు. ఈ కారణంతోనే ఐదో రోజు ఉదయం నుంచే భారత బ్యాట్స్‌మెన్లు పరుగులు రాబట్టడం మీదకన్నా క్రీజులో పాతుకుపోవడానికే ప్రాధాన్యమిచ్చారు. తద్వారా దక్షిణాఫ్రికా బౌలర్లు 82 ఓవర్లు శ్రమించినా తీసింది మూడు వికెట్లే. అదీ సెషన్‌కు ఒక్కటి చొప్పున తీయగలిగారు.

చివరికి ఇరు జట్లు డ్రాకు అంగీకరించడంతో ఐదో రోజు ఆట సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మూడో మ్యాచ్ డ్రా కావడంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. సిరీస్‌లో ఓడిపోకుండా దక్షిణాఫ్రికాను ఒంటి చేత్తో నడిపించిన ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి