నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య నేటి నుంచి కీలకమైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఘోరంగా ఓడి సిరీస్‌తో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ మ్యాచ్‌‌లో చావోరోవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

భారత్‌ జట్టులో ఫిట్‌నెస్ సాధించిన డాషింగ్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు తిరిగి జట్టులో చేరనున్నారు. ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్‌లు కొత్త బంతిని పంచుకోనుండగా గాయంతో హర్భజన్ వైదొలగడంతో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులో స్థానం పొందనున్నాడు. అయితే నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం కూడా లేకపోలేదని భారత సారధి మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు.

ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే దాదాపు కొనసాగించే అవకాశం ఉంది. వెన్ను గాయంతో రెండో టెస్ట్‌లో ఆడలేకపోయిన పేసర్ క్రిస్ ట్రెమ్లెట్ ఈ టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడు. కాగా గత మూడు రోజులుగా లండన్‌లో జరుగుతున్న అల్లర్లు టెస్ట్ మ్యాచ్ జరుగనున్న బర్మింగ్‌హామ్‌కు కూడా విస్తరించడంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి