పాంటింగ్ బృందంపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలు!

మంగళవారం, 10 నవంబరు 2009 (09:25 IST)
భారత్‌లో పర్యటిస్తున్న రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో సిరీస్‌కు దూరమైన కొత్త కుర్రాళ్లతో అదీ భారత గడ్డపై టీమ్ ఇండియాను మట్టికరిపించడం సామాన్యమైన విషయమేమీ కాదని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, మరో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్‌ను 4-2 తేడాతో కైవసం చేసుకోవడం అభినందనీయమని ప్రస్తుతించింది.

ఆసీస్‌ దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతోనే అసాధారణ రీతిలో రాణించింది. ముఖ్యంగా, ఆదివారం గౌహతిలోనే జరిగిన ఆరో మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్‌ను వెన్నువిరించింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-2తో కైవసం చేసుకుంది. కాగా, ఈ సీరీస్‌ విజయం వల్ల ప్రపంచ ఛాంపియన్లు ఆసీస్‌ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లలో అగ్రస్థానంలో నిశ్చింతగా కొనసాగనుంది.

నంబర్‌ వన్‌ ర్యాంకు లేకుండా రికీ పాంటింగ్‌ బృందాన్ని స్వదేశానికి తిప్పిపంపాలన్న ఇండియా ఆకాంక్షలోని డొల్లతనాన్ని నిరూపిస్తూ ఆస్ట్రేలియా ఆరు వికెట్ల గెలుపుతో సీరీస్‌ను, వన్‌డే అగ్రస్థానం హక్కులను కైవసం చేసుకుంది అని ఆసీస్ పత్రికలు పేర్కొన్నాయి. పాంటింగ్‌ బృందం సీరీస్‌ విజయం భారతీయ మానసిక స్థైర్యాన్ని మరింతగా దెబ్బ తీస్తుందనని మరో పత్రిక ఓ కథనం రాసింది. ఇలా ఆస్ట్రేలియా పత్రికలు పలు రకాల హెడ్డింగులతో వివిధ రకాలుగా రికీ సేనపై పొగడ్తల వర్షం కురిపించాయి.

వెబ్దునియా పై చదవండి