పాకిస్థాన్‌ను సాదరంగా ఆహ్వానిస్తాం: శరద్ పవార్!

మంగళవారం, 10 నవంబరు 2009 (12:11 IST)
భారత్ ఆతిథ్యం ఇచ్చే 2011 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు దాయాది దేశం పాకిస్థాన్ చేరుకుంటే ఆ దేశాన్ని భారత్‌లో ఆడేందుకు తాము సాదరంగా ఆహ్వానిస్తామని 2011 ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ శరద్ పవార్ తెలిపారు. ఇలాంటి మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకునే జట్లలో పాక్ కూడా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2011 ప్రపంచ కప్ మ్యాచ్‌ల డ్రాను సోమవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు పాక్ అర్హత సాధిస్తే తప్పకుండా ఆ దేశ క్రికెట్ జట్టును ఆహ్వానిస్తామన్నారు. దీనికి ప్రభుత్వం కూడా అడ్డు చెప్పబోదన్నారు.

ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు. అది పాకిస్థాన్ కావచ్చు లేదా మరొక దేశం కావచ్చు. ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్‌కు చేరుకునే జట్లను క్రికెట్‌ను ప్రేమించే భారత్ ఆహ్వానిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, ప్రపంచ కప్‌ను నిర్వహించే బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక దేశాల్లో పర్యటించేందుకు వీలుగా క్రికెట్ అభిమానులకు ఉమ్మడి (కామన్) వీసాను అందజేసే అవకాశాలపై పవార్‌‍ను ప్రశ్నించగా, ఇది కేవలం ప్రతిపాదన. ఈవెంట్ నిర్వహించే మూడు దేశాల్లో పర్యటించేలా కామన్ వీసాను అందజేసే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు శరద్ పవార్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి