పాక్ కెప్టెన్ షోయబ్ మాలిక్‌పై ఏడాదిపాటు నిషేధం?

FILE
పాకిస్థాన్ ఆటగాళ్లకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసిరాలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టుకు ఎదురైన ఘోర పరాజయ ప్రభావం ఆ జట్టు క్రికెటర్లను వెంటాడుతోంది.

ఫలితంగా ఆసీస్‌పై పాక్ ఓటమి గురించి విచారణ జరిపిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసిం బారీ నేతృత్వంలోని విచారణ కమిటీ చేసిన సిఫార్సులను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అమలు చేసినట్లైతే కెప్టెన్ షోయబ్ మాలిక్‌పై ఏడాదిపాటు నిషేధం విధించే అవకాశం ఉంది. అలాగే టాంపరింగ్‌కు పాల్పడిన షాహిద్ ఆఫ్రీదీతో పాటు అక్మల్ సోదరులు కమ్రాన్, ఉమర్‌లపై లక్షలాది రూపాయల భారీ జరిమానా విధించే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి.

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టు మొత్తం మూడు ఫార్మెట్లలో చిత్తుగా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. పాక్‌కు ఎదురైన ఈ ఘోర పరాభవానికి ఆటగాళ్ల మధ్య కుమ్ములాటలు, క్రమశిక్షణా రాహిత్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో పాక్ జట్టు పరాజయంపై విచారణ జరిపిన కమిటీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను అఫ్రిది, అక్మల్ సోదరులకు 30 లక్షల రూపాయల జరిమానా, జట్టు కెప్టెన్ షోయబ్ మాలిక్, రాణా నవీద్‌లపై ఏడాదిపాటు నిషేధం విధించాల్సిందిగా వాసింబారీ కమిటీ సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి