పాక్ క్రికెటర్ల షర్ట్‌లపై స్పాన్సర్ల లోగో మాయం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ క్రికెట్ స్పాన్సర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంకతో ఇటీవల జరిగిన తొలి రెండు వన్డేల్లో పాక్ క్రికెటర్లు ధరించిన చొక్కాలపై స్పాన్సర్ల లోగో కనిపించకపోవడం వివాదాస్పదమైంది. స్పాన్సర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాక్ బోర్డు హుటాహుటిన లోగోలు ఉన్న చొక్కాలను శ్రీలంక పంపించింది.

ఆదివారం శ్రీలంక పర్యటనకు బయలుదేరిన పాకిస్థాన్ ఎ జట్టుతో ఈ కొత్త కిట్‌లను పంపించారు. ఈ కిట్‌లు పాక్ క్రికెటర్లకు మూడో వన్డే ప్రారంభానికి కాసేపటి ముందు అందాయని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

తొలి రెండు వన్డేల సందర్భంగా ఆటగాళ్లు ధరించిన చొక్కాలపై లోగోలు మాయమవడం పట్ల స్పాన్సర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. వన్డే సిరీస్‌కు మొదట పంపిన కిట్‌లలో ఆటగాళ్ల చొక్కాలపై లోగోలు ఉన్నాయో లేదో సంబంధిత యంత్రాంగం పరిశీలించకపోవడం వలనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి