పాక్ క్రికెట్‌లో సంక్షోభం: వైదొలగిన చీఫ్ సెలక్టర్

పాకిస్థాన్ క్రికెట్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలుకావండతో ఆ జట్టు జాతీయ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి అబ్దుల్ ఖాదిర్ తప్పుకున్నారు. మ్యాచ్ ఫలితం వెలువడిన మరుక్షణమే తన రాజీనామా లేఖను పీసీబీకి సమర్పించారు.

ఖాదిర్ రాజీనామా లేఖను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఛైర్మన్ ఇజాజ్ భట్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించారు. చీఫ్ సెలక్టర్ రాజీనామాకు సంబంధించిన కారణాలు మాకు తెలియదు. అయితే, ఖాదిర్ రాజీనామాను మాత్రం ఇజాజ్ భట్ అంగీకరించారని పీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సలీమ్ అల్తాఫ్ మీడియాకు వెల్లడించారు.

కాగా, తన రాజీనామాపై వ్యాఖ్యానించేదుకు అబ్దుల్ ఖాదిర్ అందుబాటులో లేరు. ఆయన మొబైల్ ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఖాదిర్ రాజీనామాపై మాత్రం పలు ఊహాగానాలు వస్తున్నాయి. మాజీ టెస్ట్ లెగ్ స్పిన్నర్ అయిన ఖాదిర్‌ను రాజీనామా చేయాలని లేదంటే తొలగిస్తామని బెదిరించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పీసీబీ కార్యాలయానికి పిలిపించి ఈ విషయాన్ని ముఖంపై స్పష్టంగా చెప్పడంతో ఖంగుతిన్న ఖాదిర్ మారు మాట్లాడకుండా రాజీనామాను చేసినట్టు బోర్డు వర్గాల సమాచారం. దీంతో పాక్ క్రికెట్ బోర్డులో ఏం జరుగుతుందో అంతుచిక్కక మీడియా కొట్టుమిట్టాడుతోంది.

వెబ్దునియా పై చదవండి