పాక్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు: ఖాదీర్ సందేహం

పాకిస్థాన్ జట్టును మ్యాచ్ ఫిక్సింగ్ భూతం మరోసారి వెంటాడుతోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు సభ్యులను ఇటీవల కొందరు మ్యాచ్ ఫిక్సర్లు కలుసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు ఉండే అవకాశం ఉందని పాకిస్థాన్ మాజీ చీఫ్ సెలెక్టర్ అబ్దుల్ ఖాదీర్ అనుమానం వ్యక్తం చేశారు.

శ్రీలంక పర్యటనలో పాకిస్థాన్ జట్టు పేలవంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ రెండింటిని చేజార్చుకున్న పాక్ జట్టులో కొందరు మ్యాచ్ ఫిక్సర్లు ఉన్నారని ఖాదీర్ అనుమానం వ్యక్తం చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టెస్ట్ సిరీస్‌ను 0-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఐదు మ్యాచ్‌‍ల వన్డే సిరీస్‌లోనూ 0-3తో వెనుకబడి సిరీస్ చేజార్చుకుంది.

దీనిపై ఖాదీర్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. శ్రీలంకలో జట్టు పేలవ ప్రదర్శనకు ఇతర కారణాలేవైనా ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఐదు వారాల క్రితం ఇంగ్లండ్‌లో ట్వంటీ- 20 ప్రపంచకప్ గెలుచుకున్న జట్టు ఇప్పుడు వరుసగా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. శ్రీలంకలో పర్యటించిన అతి చెత్త పాక్ జట్టు ఇదేనని ఖాదీర్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి