పునరావాస కార్యక్రమం: దుబాయ్‌కు ఫ్లింటాఫ్

కుడి మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న ఫ్లింటాఫ్ పునరావాస కార్యక్రమంలో భాగంగా వచ్చే కొన్ని నెలలపాటు దుబాయ్‌లో గడపనున్నాడు. 31 ఏళ్ల ఈ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ గత నెలలో యాషెస్ సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మోకాలికి ఫ్లింటాఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

ఇప్పుడు దీని నుంచి కోలుకునేందుకు ఫ్లింటాఫ్‌కు ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. తిరిగి వచ్చే ఏడాదినాటికి జాతీయ వన్డే, ట్వంటీ- 20 జట్టుకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఫ్లింటాఫ్‌గా గాయం నుంచి వేగంగా కోలుకునేందుకు ఇంగ్లండ్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు.

వేడిగా ఉండే వాతావరణంలో ఫ్లింటాఫ్ వేగంగా కోలుకునే అవకాశం ఉందని, అందువలన అతని పునరావాస ప్రక్రియను దుబాయ్‌లో కొనసాగించాలని నిర్ణయించారు.

ఫ్లింటాఫ్ పునరావాస ప్రక్రియను ఇంగ్లండ్ మాజీ ఫిజియోథెరపిస్ట్ డేవ్ రాబర్ట్స్ పర్యవేక్షిస్తున్నాడు. ఇందుకోసం ఫ్లింటాఫ్ దుబాయ్‌లో వచ్చే కొన్ని నెలలు ఉండబోతున్నాడు. వెచ్చటి వాతావరణంలో పునరావాస ప్రక్రియను నిర్వహించడం సులభంగా ఉంటుంది. అందుకోసమే తాము దుబాయ్ వెళ్లాలని నిర్ణయించినట్లు ఫ్లింటాఫ్ మంగళవారం వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి