ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వెస్ట్‌జోన్!

FILE
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. లక్ష్య ఛేదనలో వెస్ట్ జోన్ జట్టు ఈ రికార్డును సాధించింది. ఆ జట్టు మెరుపువీరుడు.. యూసఫ్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్ ముందు సౌత్ జోన్ ఉంచిన 541 పరుగుల లక్ష్యం చిన్నదైపోయింది. ఫలితంగా.. వెస్ట్ జోన్ జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో యూసుఫ్‌ పఠాన్‌ (210 నాటౌట్‌: 190 బంతుల్లో 19 బౌండరీలు, 10 సిక్స్‌లు) మెరుపు డబుల్‌ సెంచరీతో వెస్ట్‌జోన్‌ మూడు వికెట్ల తేడాతో చిరస్మరణీ యమైన విజయాన్ని సాధించింది.

ప్రపంచంలో తొలిసారిగా అత్యధిక పరుగులు 541 లక్ష్యాన్ని అందుకున్న జట్టుగా హైదరాబాద్ గడ్డపై వెస్ట్‌జోన్‌ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. వెస్ట్‌జోన్‌కు దులీప్‌ట్రోఫీ రావడం ఇది 16వసారి. గత ఏడాది కూడా సౌత్‌జోన్‌ పైనే నెగ్గి వెస్ట్‌ ట్రోఫీని సొంతం చేసుకొంది.

అంతకుముందు 379/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన వెస్ట్‌జోన్‌ బ్యాట్స్‌మెన్‌ యూసుఫ్‌పఠాన్‌ (84 నాటౌట్‌), సాహా (0 నాటౌట్‌)లు చివరి రోజు ఆట కొనసాగించారు. తొలి బంతికే బౌండరీ కొట్టి యూసుఫ్‌ సౌత్‌ జోన్‌ బౌలర్లకు షాక్ ఇచ్చాడు.

కాసేపటికి గణపతి బౌలింగ్‌లో బ్యాక్‌పాయింట్‌ ఫోర్‌తో యూసుఫ్‌ ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ కోసం 84 బంతులాడిన యూసుఫ్‌ 10 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టాడు. ఐతే సెంచరీ అయిన వెంటనే 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు గణపతి సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

ఆ తర్వాత కూడా సౌత్‌జోన్‌ ఫీల్డర్లు పేలవమైన ఫీల్డింగ్‌ కారణంగా యూసుఫ్‌ 125 పరుగుల వద్ద, 170 పరుగుల వద్ద ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకొని ఆడిన సాహా.. యూసుఫ్‌కు మంచి భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించిన అనంతరం సాహా ( 16: 116 బంతుల్లో 1 ఫోర్‌) ఔట్‌ అయ్యాడు.

వెబ్దునియా పై చదవండి