బంగ్లా‌ వన్డే సిరీస్‌కు విండీస్ క్రికెటర్లు దూరం!

బుధవారం, 8 జులై 2009 (12:48 IST)
వెస్టిండీస్ క్రికెటర్లు మరోమారు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమకు కాంట్రాక్టులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్‌కు పరిష్కరించని పక్షంలో గురువారం నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఆరంభంకానున్న వన్డే, టెస్ట్ సిరీస్‌ను బాయ్‌కట్ చేస్తామని హెచ్చరించారు.

దీనిపై వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినానాథ్ రామ్‌నారైన్ మాట్లాడుతూ.. బోర్డు కాంట్రాక్టులు ప్రకటించేంత వరకు క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టబోరన్నారు. ఇది తమ దీర్ఘకాలిక సమస్యగా ఉంది. అందువల్ల తక్షణం పరిష్కరించాలని కోరుతున్నట్టు చెప్పారు.

గత నాలుగు టోర్నమెంట్‌లలో క్రికెటర్లు ఎలాంటి కాంట్రాక్టులు లేకుండానే పాల్గొన్నారు. ప్రస్తుతం ఐదో టోర్నమెంట్‌లో కూడా కాంట్రాక్టు లేకుండానే బరిలోకి దిగాలని బోర్డు కోరుతోంది. దీనికి మరో అవకాశమే లేదు. అందువల్ల కాంట్రాక్టులను ప్రకటించాల్సిందేనని ఆయన కోరారు.

దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌ను బాయ్‌కట్ చేస్తే ఒప్పందాన్ని ఉల్లంఘిచినట్టేనని అభిప్రాయపడింది. హోమ్ సిరీస్‌లో పాల్గొనకుంటే ఆటగాళ్లపై చర్య తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి