బ్రాడ్ హడ్డిన్ సెంచరీ: ఆస్ట్రేలియా ఘన విజయం

FILE
హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన పరుగుల లక్ష్యాన్ని, ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలోనే చేధించి గెలుపొందింది. కంగారూల ఆటగాళ్లలో హడ్డిన్ సెంచరీ సాధించి జట్టుకు విజయం సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

న్యూజిలాండ్ నిర్ధేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ హడ్డిన్ 121 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ (110పరుగులు) చేశాడు. ఇక కంగారూల కెప్టెన్ రికీ పాంటింగ్ అర్థసెంచరీ (69) సాధించాడు. రికీ పాంటింగ్, బ్రాడ్ హడ్డిన్‌ల భాగస్వామ్యంతో ఆసీస్ రెండో వికెట్‌కు 151 పరుగులు సాధించారు.

మిగిలిన ఆసీస్ ఆటగాళ్లలో వాట్సన్ (15), హస్సీ (9), వైట్ (25), వోగ్స్ (13)లు జట్టు విజయానికి తమ వంతు పరుగులు చేశారు. దీంతో ఆసీస్ 47.2 ఓవర్లలోనే నాలుగు వికెట్ల పతనానికి 248 పరుగులతో గెలుపొందింది.

అంతకుముందు తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 245 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో టాయిలర్ (62) మాత్రమే అర్థసెంచరీ చేశాడు. కానీ ఆసీస్ బౌలర్ల ధాటికి స్టైరిస్ (41), హోప్‌కిన్స్ (45)లు హాఫ్ సెంచరీలను చేజార్చుకున్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో హారిస్, జాన్సన్ చెరో మూడేసి వికెట్లు పడగొట్టగా, షేన్ వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, మాసన్, వెటోరీలు తలా ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి