బ్రెట్‌లీ పుంజుకుంటాడు: పాంటింగ్ ఆశాభావం

వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ విశ్వరూపం చూపించడంతో వెలవెలబోయిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీకి ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ మద్దతుగా నిలిచాడు. అతను తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. క్రిస్ గేల్ చెలరేగి ఆడుతుంటే, అతని ముందు బ్రెట్‌లీ ఓ క్లబ్ బౌలర్‌గా కనిపించాడు.

వెస్టిండీస్‌‍తో జరిగిన తొలి ప్రపంచకప్ ట్వంటీ- 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు కళ్లెం వేసేందుకు బ్రెట్‌లీ నేతృత్వంలోని ఆస్ట్రేలియా బౌలింగ్ దళం చేసిన ప్రయత్నాలన్నీ ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 50 బంతులు ఎదుర్కొని 88 పరుగులు పిండుకున్నాడు.

ముఖ్యంగా బ్రెట్‌లీ తాను వేసిన నాలుగు ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్నాడు. చివరకు క్రిస్ గేల్ వికెట్‌ను పడగొట్టినప్పటికీ, అప్పటికే గేల్ చేతిలో ఆస్ట్రేలియాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలాకాలం గాయంతో బాధపడిన బ్రెట్‌లీ తిరిగి కోలుకున్న తరువాత ఆడిన రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఇది.

ఈ మ్యాచ్‌లో బ్రెట్‌లీ కొంచెం తడబడినప్పటికీ, ఇందులో అతడిని సంశయించాల్సిన అవసరం లేదు. క్రిస్ గేల్ విశ్వరూపం ముందు ఎవరైనా ఒకటేనని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కూడా పుంజుకుంటున్న తీరు ఆశావహంగా ఉందని పాంటింగ్ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి