భారత్‌తో వామప్: ఇంగ్లండ్ ఎలెవన్ జట్టుకు మరో పరాభవం

FILE
భారత్-ఎ జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో చతికిలబడిన ఇంగ్లండ్ ఎలెవన్ జట్టు తాజాగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మంగళవారం ఢిల్లీ జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో మట్టికరిచింది.

భారత యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌పై మరోసారి విజృంభించి సత్తా చాటుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్టుకు భారత్‌లో వన్డే క్రికెట్ సిరీస్‌కు ముందు వరుసగా మరో పరాభవం ఎదురైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ ఢిల్లీ జట్టు 48.3 ఓవర్లలో 4 వికెట్లను మాత్రమే నష్టపోయి సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది.

బ్యాట్ ఝుళిపించి ఇంగ్లాండ్ బౌలర్ల భరతం పట్టిన కెప్టెన్ శిఖర్ ధావన్ (110), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మిలింద్ కుమార్ (78-నాటౌట్) ఢిల్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఎలెవెన్ జట్టుకు ఓపెనర్లు ఆలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ 70 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి శుభారంభాన్ని అందించారు.

కుక్ (44) ఇయాన్ బెల్ (108), ఇయాన్ మోర్గాన్ (52) మెరుగ్గా రాణించడంతో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో వరుణ్ సూద్ 45 పరుగులకు 3 వికెట్లు కైవసం చేసుకోగా, జాగృత్ ఆనంద్, సుమిత్ నర్వాల్ చెరో వికెట్ సాధించారు.

వెబ్దునియా పై చదవండి