భారీ బోనస్ మొత్తాన్ని అందుకోనున్న రికీ పాంటింగ్!

సోమవారం, 9 నవంబరు 2009 (14:46 IST)
భారత పర్యటనలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ భారీ మొత్తంలో బోనస్ మనీని అందుకోనున్నారు. స్వదేశంలో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినప్పటికీ.. రికీ పాంటింగ్ ఆదాయానికి మాత్రం ఎక్కడా గండి పడలేదు.

క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య కుదిరిన సెంట్రల్ కాంట్రాక్టులో భాగంగా రికీకి 20.3 మిలియన్ డాలర్ల బోనస్ మనీ దక్కనుంది 25 మంది సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్ళకు సంవత్సరానికి మిలియన్‌ డాలర్లు అందేలా చూడాలన్నదే ఈ ఒప్పంద లక్ష్యం.

ఈ క్రమంలో పాంటింగ్‌కు సుమారు ఒక మిలియన్‌ డాలర్లు బోనస్‌ను గత నెలలోనే అందించినట్లు వార్తా పత్రికల సమాచారం. పాంటింగ్‌కు లభించిన ఈ ఆదాయాన్ని పరిశీలించగా, గత నాలుగేళ్ళలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ఊహించిన దానికంటే భారీగా ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది.

ఈ బోనస్ మనీని అందుకున్న వారిలో మాజీ వికెట్ కీపర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మాజీ లెజండ్ షేన్‌వార్న్‌, జస్టిన్ లాంగర్‌తో సహా సుమారు 300 మంది క్రికెటర్లు ఉన్నట్టు సమాచారం. 2005లో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు 478 మిలియన్‌ డాలర్ల ఆదాయం చేకూరగా, ప్రస్తుతం దీనికి అధికంగానే ఆదాయం వచ్చినట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి