మహిళలతో అసభ్య ప్రవర్తన, బౌన్సర్లపై మూత్రం: పనేసర్‌కు జరిమానా

FILE
మద్యం తాగిన మైకంలో గొడవకు దిగిన ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్‌కు పోలీసులు జరిమానా విధించారు. మద్యం తాగి గొడవకు దిగడమే కాకుండా, అడ్డుకున్న బౌన్సర్లపై మూత్రం విసర్జించి పారిపోయిన పనేసర్‌కు పోలీసులు ఫైన్ విధించారు.

సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లండన్‌లోని ఓ క్లబ్‌లో ఈ సంఘటన జరిగింది. తాజాగా ముగిసిన యాషెస్ మూడో టెస్ట్‌లో పాల్గొన్న 14 మంది సభ్యుల జట్టులో పనేసర్ ఒకడు. బ్రైటన్ తీరంలోని షూష్ అనే నైట్ క్లబ్‌కు హాజరైన పనేసర్ అక్కడున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని క్లబ్ నుంచి గెంటేశారు.

తరువాత క్లబ్ పైన షికారు చేసిన మాంటీ.. అక్కడ నుంచి మూత్రం పోశాడు. అది బౌన్సర్ల పైన పడింది. దీంతో ఆగ్రహించిన బౌన్సర్లు వెంటపడటంతో దిక్కు తోచని పనేసర్ సమీపంలోని పిజ్జా దుకాణంలో దూరాడు. అతన్ని అదుపులోకి తీసుకుని సస్సెక్స్ పోలీసులకు అప్పగించడంతో 90 పౌండ్లు జరిమానా విధించారు.

నైట్ క్లబ్ ఘటనను ధ్రువీకరించిన సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్.. దర్యాప్తునకు ఆదేశించినట్టుగా పేర్కొంది. శుక్రవారం నుంచి జరగనున్న నాలుగో యాషెస్ టెస్ట్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టులో పనేసర్‌కు చోటు దక్కలేదు.

వెబ్దునియా పై చదవండి