మా మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించవద్దు: పీసీబీ

గురువారం, 15 అక్టోబరు 2009 (12:31 IST)
2011 ప్రపంచ కప్ టోర్నీ షెడ్యూల్‌లో భాగంగా తమ జట్టు ఆడే మ్యాచ్‌లకు వేదికలను భారత్‌లో కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో నిర్వహించేలా ఖరారు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలికి విజ్ఞప్తి చేసింది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న దౌత్య, రాజకీయ పరమైన విభేదాలను ఐసీసీ దృష్టిలో ఉంచుకోవాలని పీసీబీ కోరింది.

ఈ మేరకు ఐసీసీకి పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్ విజ్ఞప్తి చేశారు. ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో పాల్గొన్న భట్.. బుధవారం కరాచీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తలు ఐసీసీకి తెలిసే ఉంటుందన్నారు.

అందువల్ల ప్రపంచ కప్‌లో తమ జట్టు ఆడే మ్యాచ్‌లకు వేదికలను భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో ఎంపిక చేయాలని కోరినట్టు చెప్పారు. అనేకంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఉండేలా చూస్తే ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.

అయితే, 2011 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలు మెరుగుపడతాయని భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ నిర్ణయానికి పీసీబీ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం మాకు ఏం చెపుతుందో దాన్ని చేస్తాం. అయితే, 2011 నాటికి సంబంధాలు కొంతమేరకైనా మెరుగుపడతాయని భావిస్తున్నా అని భట్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి