ఏప్రిల్ 26న నిర్వహించాలనుకున్న సమావేశాన్ని మరో ఐదు రోజుల తర్వాత జరపాలని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ చేసిన విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది. అనుకున్నట్లుగానే ఏప్రిల్ 26న యధావిధిగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమవుతుందని తేల్చి చెప్పింది.
అనుకున్న ప్రకారం సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే పలు రకాల అనుమానాలకు తావిచ్చినట్లవుతుందనీ, ప్రస్తుతం ఐపీఎల్‌కు సంబంధించి అనేక వివాదాలు, ఆరోపణలు షికారు చేస్తున్న దశలో వాయిదా కుదరదని తేల్చి చెప్పింది.
బీసీసీఐ తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో లలిత్ మోడీ సైతం తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ ఇచ్చుకున్నాడు. కొంతమంది తనపై రాజీనామా చేయమని ఒత్తిడి తెస్తున్నారనీ, ఆ పనిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని తేల్చి చెప్పాడు. ఒకవేళ తనను తొలగిస్తే... ఆ తర్వాత దానిగురించి ఆలోచిస్తానన్నాడు.
మొత్తమ్మీద ఐపీఎల్ - బీసీసీఐ మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపెవరిదో చూడాలంటే ఏప్రిల్ 26 వరకూ... అంటే సోమవారం దాకా ఆగాల్సిందే.