యూనిస్, భట్‌లకు పాక్ పార్లమెంటరీ కమిటీ సమన్లు

మంగళవారం, 6 అక్టోబరు 2009 (15:42 IST)
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓటమిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. పాక్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడం వల్లే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారనే పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ దేశ పార్లమెంటరీ కమిటీ (క్రీడలు) కెప్టెన్ యూనిస్ ఖాన్, కోచ్ ఇంతికాబ్ ఆలమ్, పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్‌లకు సమన్లు జారీ చేసింది.

ఈ కమిటీకి సీనియర్ పార్లమెంటు సభ్యుడు జమ్షద్ ఖాన్ దస్తీ నేతృత్వం వహిస్తున్నారు. గ్రూపు బి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు కావాలనే ఓడిపోయారని ఈయన ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని స్టాడింగ్ కమిటీ యూనిస్, ఆలమ్, భట్‌లకు సమన్లు జారీ చేసింది.

ప్రధాన కారణంతోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయారనే దానికి తగిన ఆధారం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ళ ప్రదర్శన ఊహించనంతగా లేదు. అలాగే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ పాక్ ఆటగాళ్లు విజయకాంక్షను ప్రదర్శించలేదని దస్తీ అరోపించారు.

వెబ్దునియా పై చదవండి