యూసఫ్, యూనిస్‌ ఖాన్‌లపై జీవితకాల నిషేధం!

FILE
ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ఆటతీరును ప్రదర్శించి ఘోర పరాజయానికి కారణమైన పాకిస్థాన్ క్రికెటర్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిషేధం వేటు వేసింది. ఆసీస్ టూర్‌లో పాక్ ఓడిపోవడానికి ఆటగాళ్ల ఆటతీరు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అంశాలే ప్రధాన కారణమని విచారణలో తేలడంతో పీసీబీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా పాక్ ఫాస్ట్ బౌలర్ రాణా నవేద్, కెప్టెన్ షోయబ్ మాలిక్‌లపై ఒక ఏడాది పాటు నిషేధం విధించింది. అలాగే మొహమ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్‌లపై జీవిత కాల నిషేధాన్ని విధిస్తూ పీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, షాహిద్ అఫ్రిదిలపై 20 లక్షల నుంచి 30 లక్షల వరకు భారీ జరిమానాను విధించింది. అంతేగాకుండా జరిమానా విధించిన కమ్రాన్, అక్మల్, అఫ్రిదిల కదలికలు, ప్రవర్తనలపై ఆరు నెలల కాలం నిఘా ఉంచుతామని పీసీబీ అధ్యక్షుడు ఇజాజ్ భట్ బుధవారం స్పష్టం చేశారు.

ఇదేవిధంగా..మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కూడా పీసీబీ భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని అతనికి చేరాల్సిన నగదు నుంచే పీసీబీ వసూలు చేసింది.

మరోవైపు పీసీబీ విధించిన నిషేధంతో సీనియర్ ఆటగాళ్లైన మొహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్‌లు ఇకపై పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నారు. అయితే వీళ్లిద్దరూ కౌంటీ, పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది.

ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ వైపల్యంపై పీసీబీ నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా పాక్ బోర్డు పాక్ ఆటగాళ్లపై నిషేధం వేటు వేసింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే స్వదేశ క్రికెటర్లపై ఇంతటి కఠినమైన చర్యలు తీసుకున్న వ్యవస్థగా పీసీబీ నిలిచింది.

వెబ్దునియా పై చదవండి