లారెస్ వరల్డ్ స్పోర్ట్స్‌మన్ అవార్డు రేసులో టెండూల్కర్!

FILE
2011 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, ఫార్ములా వన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ వంటి వారితో సచిన్ పోటీ పడుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్న సచిన్ టెండూల్కర్‌తో పాటు శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్లు డీగో ఫోర్లాన్, ఇనియెస్టా లియోనల్ మెస్సీలు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.

లారెస్ మీడియా సెలక్షన్ ప్యానెల్ ఓటింగ్ ప్రకారం పోటీలో ఉన్నవారిని ఆరుకు తగ్గించి, వారి పేర్లను జనవరిలో వెల్లడిస్తారు. జనవరిలోపు విజేతలను ప్రకటించి, ఫిబ్రవరి ఏడో తేదీన అబుదాబిలో జరిగే ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన సచిన్ టెండూల్కర్, టెస్టు క్రికెట్ చరిత్రలో 14వేల స్కోరును సాధించిన తొలి క్రికెటర్‌గా ఘనతకెక్కాడు. అక్టోబర్‌లో ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ (సచిన్ 171వ టెస్టు మ్యాచ్)లో సచిన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి