లార్డ్స్ మైదానంలో మాస్టర్ సచిన్ వందో సెంచరీ సాధిస్తాడా!?

ఇంగ్లండ్‌తో జరుగనున్న క్రికెట్ సిరీస్ కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్‌లో మెరుగ్గా రాణించేందుకు సచిన్ టెండూల్కర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ సచిన్ ఇప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలను, వన్డేల్లో 48 శతకాలు సాధించాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ సిరీస్‌లో తన వందో శతకాన్ని పూర్తి చేయాలని సచిన్ భావిస్తున్నాడు. ఈ వందో శతకాన్ని ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగే మొదటి టెస్టులోనే సాధించాలని సచిన్ ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి టెస్టు జూలై 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మాస్టర్ వందో శతకాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు.

కాగా, ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జూలై 21 నుంచి 25వ తేదీ వరకూ ‘క్రికెట్ మక్కా’గా ప్రసిద్ధి చెందిన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అది ఇంగ్లాండ్‌తో భారత్‌కు 100వ టెస్టు కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

అంతేగాక, టెస్టు క్రికెట్ చరిత్రలో 2000వ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో, లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసి ‘సెంచరీల సెంచరీ’ని పూర్తి చేయాలన్నదే సచిన్ అభిమతమని, అందుకే, విండీస్ టూర్‌కు అతను వెళ్లలేదని కొంతమంది బలంగా వాదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి