వడోదరా వన్డే: భారత్ విజయ లక్ష్యం 225 పరుగులు

FILE
భారత్‌తో జరుగుతున్న వడోదరా వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా యంగ్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు విజృంభించడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి, 224 పరుగులకే పరిమితమైంది. తద్వారా భారత్‌కు 225 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. భారత బౌలింగ్ ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఫ్రాంక్లిన్ (72; 108 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్; నాటౌట్), నాథన్ మెక్ కల్లమ్ (43)లు మాత్రమే రాణించగలిగారు. దీంతో కివీస్ 224 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకోగలిగింది.

మిగిలిన బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ గుప్తిల్ (12), మెక్ కల్లమ్ (0), విలియమ్సన్ (21), టైలర్ (4)లు జహీర్ ఖాన్, పటేల్ బౌలింగ్‌ వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఇదే తరహాలో స్టైరిస్ (22), వెట్టోరి (3), హోప్కిన్స్ (6)లు కూడా అశ్విన్, యూసుఫ్ పఠాన్‌లకు వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి ఫ్రాంక్లిన్ (72) మాత్రమే నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 50 ఓవర్లలో కివీస్ 9వికెట్లు కోల్పోయి 224 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశ్విన్, పఠాన్‌లు రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, పటేల్ ఏకైక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి