వన్డే ప్రపంచకప్‌లో రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తా: అశ్విన్

భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ధీటుగా రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తానని భారత ఆఫ్-స్పిన్నర్ అశ్విన్ చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడికి లోనుకాకుండా మైదానంలో మెరుగ్గా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని అశ్విన్ తెలిపాడు. ఒత్తిడిని అధిగమించడంతో పాటు బ్యాటింగ్ మరియు బౌలింగ్‌ను మెరుగుపరుచుకుని వన్డే మ్యాచ్‌లు ఆడుతానని అశ్విన్ అన్నాడు.

వన్డే ప్రపంచకప్‌ జట్టులో స్థానంతో పాటు ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో ఆడటం వంటి కలను సాకారం చేసుకునేందుకు వీలుగా తన ఆటతీరును మలుచుకుంటానని అశ్విన్ వెల్లడించాడు. ఫీల్డ్‌లో సందర్భానికి అనుగుణంగా ఆటతీరును మలుచుకోవడంపై దృష్టి సారిస్తానని అశ్విన్ తెలిపాడు. ఇందుకోసం గత ఐదు నెలలుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో ప్రతిభగల ముగ్గురు స్పిన్ బౌలర్లు ఉన్నారని, ఇందులో భజ్జీ అదరగొడతాడని అశ్విన్ నమ్మకం వ్యక్తం చేశాడు. భజ్జీ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, భజ్జీ స్ఫూర్తితో పాటు అతని సలహాలు తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. ఇంకా ఆటగాళ్ల ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు కెప్టెన్ ధోనీ తగిన స్వేచ్ఛ ఇస్తున్నాడని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి