వన్డే ప్రపంచకప్‌‌లో ప్రవీణ్ కుమార్ ఆడటం అనుమానమే!

మంగళవారం, 1 ఫిబ్రవరి 2011 (18:04 IST)
FILE
భారత ఉపఖండంలో జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ కప్ గెలుచుకుంటుందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మాజీ క్రికెట్ లెజండ్లు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, టీమిండియాకు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా మోచేయి గాయంతో బాధపడుతున్న ప్రవీణ్ కుమార్, వన్డే ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌కు దూరమయ్యే ఛాన్సుంది.

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మోచేయి గాయానికి చికిత్స పొందుతున్న ప్రవీణ్ కుమార్, మెరుగైన చికిత్స కోసం ఇంగ్లాండ్‌కు సైతం వెళ్లనున్నట్లు తెలిసింది. ఇంగ్లాండ్‌ వైద్యుల సలహాలతో పాటు మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా ప్రవీణ్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ నుంచి గాయంతో అర్థాంతంగా స్వదేశానికి చేరుకున్న ప్రవీణ్ కుమార్, ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గాయం నుంచి ప్రవీణ్ ఇంకా కోలుకోలేదని, తీవ్రతను బట్టి వన్డే వరల్డ్ కప్‌లో ఆడటం తేలుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం.. గాయం తీవ్రత అంతగా లేదని భావిస్తున్నా. తప్పకుండా వన్డే ప్రపంచకప్‌లోపు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదేవిధంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు సైతం గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి