వన్డే సిరీస్‌కు భజ్జీ దూరం - జహీర్‌ ఖాన్‌కు విశ్రాంతి

శుక్రవారం, 5 ఆగస్టు 2011 (19:04 IST)
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక గానూ శనివారం చెన్నైలో సమావేశం కానున్న సెలెక్టర్లు గాయంతో స్వదేశానికి పయనమైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను పరిగణనలోకి తీసుకొనే అవకాశం కనిపించడంలేదు. కాగా పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌కు విశ్రాంతి కల్పించనున్నారు.

ఉదర కండరాల గాయంతో బాధపడుతున్న హర్భజన్‌ నాలుగు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆగస్ట్ 31న జరిగే ఏకైక ట్వంటీ20 మ్యాచ్‌తో పాటు సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు భజ్జీ అందుబాటులో వుండటం లేదు.

వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో కూడిన జట్టు బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని జహీర్ ఖాన్‌కు వన్డే సిరీస్‌కు విశ్రాంతి కల్పించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఎడమ చేతి చూపుడు వేలుకు గాయం చేసుకున్న యువరాజ్ సింగ్‌ ఎంపిక కూడా అనుమానమే.

సీనియర్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, వీరంద్ర సెహ్వాగ్‌లు అందుబాటులో ఉంటారు. మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా భావిస్తున్న కారణంగా వృద్ధిమాన్ సాహా స్థానంలో పార్ధీవ్ పటేల్‌కు రెండో కీపర్‌గా అవకాశం లభించవచ్చు.

వెస్టిండీస్ పర్యటనలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పొందిన ముంబాయి యువ ఆటగాడు రోహిత్ శర్మ, తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు జట్టులో చోటు ఖాయం. ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్‌లు వారి స్థానాలను కాపాడుకుంటారు. కాగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించిన ఎడమ చేతి వాటం సీమర్ అశిష్ నెహ్రాను సెలక్టర్లు జట్టు ఎంపికలో పరిశీలించే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న దృష్ట్యా ఆర్ వినయ్ కుమార్‌ కూడా ఎంపిక బరిలో ఉంటాడు. అయితే జట్టులో రిజర్వ్ బ్యాట్స్‌మెన్ స్థానాన్ని ఎవరు పొందుతారనే చర్చ సాగుతున్నది. యూసఫ్ పఠాన్, మనోజ్ తివారీ, అజింకా రెహానేలు ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి