విమర్శలను పట్టించుకోను: టెండూల్కర్

గత ఏడాది సీనియర్లను లక్ష్యంగా చేసుకొని భారత క్రికెట్‌లో తీవ్రస్థాయిలో వచ్చిన విమర్శలను తాను పట్టించుకోలేదని టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. విమర్శలకు తానెప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. దీనర్థం వారి అభిప్రాయాలన్నీ వాస్తవాలు అని కాదు.

విమర్శలన్నీ ఒక్కొక్కరి అభిప్రాయాలు మాత్రమే. అందుకే వాటికి ప్రాధాన్యత ఇవ్వనని, వీటి కంటే దృష్టిపెట్టాల్సిన పెద్ద అంశాలు తనకు చాలా ఉన్నాయని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఎప్పుడూ ఇటువంటి వాటి గురించి చర్చించే వారు ఉంటారు. వారిని చర్చించుకోనివ్వండి. నేను మాత్రం వారు చేసే విమర్శలను పట్టించుకోనని టెండూల్కర్ ఓ ఫ్యాషన్ మేగజైన్‌తో చెప్పాడు.

గత ఏడాది ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా టీం ఇండియా సీనియర్లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ జట్టులోని సహచర సీనియర్లకు మద్దతుగా నిలిచాడు. దేశానికి సీనియర్ ఆటగాళ్లు చాలా విలువైన సేవలు అందించారని, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని టెండూల్కర్ ఆ సమయంలో పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి